- ఉగాదికి ప్రారంభిస్తామన్న మంత్రి దామోదర
- ఇంకా పూర్తి కాని నిర్మాణ పనులు, ఫిక్స్ కాని ఎక్విప్మెంట్
- జూన్ 2న సనత్ నగర్, అల్వాల్, వరంగల్ ఆస్పత్రులను ఒకేసారి ప్రారంభించే చాన్స్
హైదరాబాద్, వెలుగు: సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభాన్ని ప్రభుత్వం మళ్లీ వాయిదా వేసేలా కనిపిస్తోంది. వాస్తవానికి ఉగాది పండుగ కానుకగా ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా గతంలో ప్రకటించారు. కానీ అక్కడ ఆ పరిస్థితులు కనిపించడం లేదు. బిల్డింగ్ బయట కలర్ ఫుల్ గానే ఉన్నా.. లోపల మాత్రం పనులు అసంపూర్తిగా ఉన్నాయి.
ఎక్విప్మెంట్ పూర్తిగా రాలేదు. ఆక్సిజన్ ప్లాంట్ పనులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడి చేసింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా డేట్లు ప్రకటిస్తూ వాయిదా వేస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. సనత్ నగర్ టిమ్స్ తో పాటు, అల్వాల్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను కలిపి జూన్ 2న తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ఒకేసారి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే, తరచూ డేట్లు ప్రకటిస్తూ వాయిదా వేస్తుండటంతో వైద్య ఆరోగ్య శాఖ తీరుపై విమర్శలు వస్తున్నాయి.
ఇంకా అసంపూర్తిగానే పనులు
రాష్ట్ర ప్రభుత్వం 99 డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా టిమ్స్ ను ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకుంది. కానీ గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితి వేరేలా ఉంది. హాస్పిటల్ లోపల ఇంకా పనులు నడుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్లు ఇంకా రెడీ కాలేదు. బెడ్లకు ఆక్సిజన్ సప్లై లైన్ల పనులు పూర్తి కాలేదు. ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం కూడా కొలిక్కి రాలేదు. కోట్లు పెట్టి కట్టిన బిల్డింగ్‌లో పేషెంట్లకు పరీక్షలు చేసే స్కానింగ్ మిషన్లు, ఇతర అత్యాధునిక వైద్య పరికరాలు ఇంకా ఇన్ స్టాల్ కాలేదు.
ఇప్పటివరకు కేవలం 30 శాతం ఎక్విప్మెంట్ మాత్రమే ఆస్పత్రికి చేరినట్లు తెలుస్తున్నది. మిగతా 70 శాతం ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. మరోవైపు ఇటీవలే డాక్టర్లతో కూడిన ఓ కమిటీ హాస్పిటల్ ను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. పలు డిపార్ట్ మెంట్లలో లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేయాలని సూచించింది. ఆ సూచనలు సరి చేయాలన్నా, కనీసం 2 నుంచి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉన్నది.
ఆర్థిక శాఖ ఆమోదానికి ఎదురుచూపులు..
సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్ ఆస్పత్రులకు కలిపి మొత్తం 4,588 మంది డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది భర్తీ కోసం వైద్య ఆరోగ్యశాఖ గత అక్టోబర్ నెలలోనే ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తున్నది. కానీ ఇప్పటివరకు ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి అప్రూవల్ రాలేదు. అయితే, అనుకున్న సమయానికి సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ ప్రారంభించేందుకు..
గాంధీ, ఉస్మానియా, మహేశ్వరం తదితర హాస్పిటల్స్ నుంచి100 మంది డాక్టర్లు, 200 మంది నర్సులు, మిగతా పారామెడికల్ సిబ్బంది మొత్తం 450 మందిని 3 నెలల కాలానికి డిప్యూటేషన్ మీద తీసుకోవాలని సర్కార్ నిర్ణయించింది. వీరిలో ఇప్పటివరకు 80 మంది మాత్రమే ఫీల్డ్ లోకి దిగారు. అయితే, పూర్తిస్థాయిలో రిక్రూట్ మెంట్ లేకుండా డిప్యూటేషన్ పై తెచ్చుకున్న సిబ్బందితో సూపర్ స్పెషాలిటీ సేవలు ఎలా అందిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
